మరదలి కోసం.. ఆన్‌లైన్‌లో కత్తులను ఆర్డర్ చేసి అందరినీ చంపేశాడు.. !
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వ్యక్తి మరదలిపై కన్నేసి తీవ్ర దారుణానికి ఒడి కట్టాడు. నాగ్‌పూర్‌కు చెందిన 36 ఏళ్ల అలోక్ మాతుర్కర్ ఆదివారం రాత్రి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త, మరదలి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్‌పూర్‌లోని గోలాబార్ చౌక్ సమీపంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే అలోక్ గత కొన్ని రోజులుగా తన భార్య చెల్లెలిపై కన్నేశాడు. అంతేకాకుండా గతంలో ఆమెపై పలుమార్లు లైగింక దాడి చేశాడు.
అలోక్ తన భార్య చెల్లెలు తనకే సొంతమని చెప్పి కుటుంబసభ్యులను తీవ్ర చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ విషయంపై కుటుంబంలో వివాదం చెలరేగడంతో ఆగ్రహానికి గురైన అలోక్ ఆదివారం రోజున తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త, మరదలిని పొడిచి చంపి ఉరి వేసుకున్నాడు. ఇంటి చుట్టు పక్క వాళ్లు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాపలాదారుడిగా పనిచేసే నిందితుడి మామ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
అలోక్ మాతుర్కర్‌కు విజయతో వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. పారి, సాహిల్. టైలరింగ్ పని చేసే తన భార్య చెల్లెలు అమీషాకు అలోక్ సహాయం చేసేవాడు. అయితే, ఆమె ఇతర వ్యక్తులతో స్నేహంగా ఉంటే అలోక్.. అమీషాను వేధించేవాడని తెలిసింది. స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడినందుకు అలోక్ తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ అమీషా దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అతడికి బుద్ది చెప్పి విడుదల చేశారు.
దీంతో అలోక్ తన కుటుంబసభ్యులను చంపడానికి ప్రణాళిక వేశాడు. అందుకోసం ముందుగానే ఆన్‌లైన్‌లో కత్తులను ఆర్డర్ చేశాడు. ఆదివారం రాత్రి తన భార్య విజయతో, అమీషాతో గొడవ పడ్డాడు.
గొడవ పెద్దదిగా మారటంతో విచక్షణ కోల్పోయిన అలోక్ ముందుగా సిద్ధం చేసుకున్న కత్తులతో తన భార్యను, మరదలిని, అత్తను తీవ్రంగా పొడిచి హత్య చేశాడు. తన పిల్లలను బండతో మోది హతమార్చాడు. చివరగా అలోక్ కూడా ఉరి వేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు.