బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (20:05 IST)

ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ.. కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం..

ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన పేరును తొలుత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాంవిలాస్ పాశ్వాన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామిలు బలపరిచారు. ఆ తర్వాత ఎన్డీయే కూటమి తరపున ఎంపికైన ఎంపీలంతా బల్లలు చరుస్తూ మోడీ పేరును బలపరిచారు. 
 
శనివారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్యపక్షాల సమావేశం ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ హాలులో జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, బీజేపీ చీఫ్ అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు ఎల్కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషిల, ఎన్డీయే భాగస్వామ్యపక్షాల నేతలు హాజరయ్యారు. 
 
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ఆధునిక భారత్ దిశగా మనం ప్రయాణం ప్రారంభించరు. ఈ ప్రయాణంలో మీరంతా ఎంతో బాగా సహకరించారు. గత ఐదేళ్ళలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం.  ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఈ సారికూడా కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత ప్రజాస్వామ్యం ఉన్నతి దిశగా పయనిస్తోందన్నారు. ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా సేవా భావం మాత్రం మర్చిపోరాదని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఈ సార్వత్రిక ఎన్నికలు భాజపాకు సానుకూలంగా ఉన్నాయి. మనపై ఈ అనుకూలధోరణి అనేది నమ్మకం అనే దారంతో ముడివేసి ఉంది. ఈ నమ్మకం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండడమే కాదు.. సాధారణంగా జనంలోనూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త ఎంపీలందరికీ, వారి విజయం కోసం కృషి చేసిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం విజయవంతంగా నిర్వహించిందని మోడీ కొనియాడారు.