జనసేన పోటీ చేసిన సీట్లు 136... డిపాజిట్లు కోల్పోయిన సీట్లు 120
ఏపీ శాసనసభ ఎన్నికల్లో సినీ నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ 136 చోట్ల పోటీ చేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట విజయాన్ని సాధించింది. చివరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఫలితంగా ఆ పార్టీ ఏకంగా 120 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.13 కోట్ల ఓట్లు పోలయ్యాయి. వీటిలో జనసేనకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలు మిగిలిన జిల్లాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు.. నోటా గుర్తుకు వచ్చిన ఓట్ల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం.
గత 2009 ఎన్నికల్లో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 అసెంబ్లీ సీట్లు దక్కించుకోగా, ఎమ్మెల్యేగా చిరంజీవి సైతం గెలుపొందారు. ఆ పార్టీకి ఏకంగా 18 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. కానీ, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ మాత్రం కేవలం ఏడు శాతం ఓటు బ్యాంకును మాత్రమే సొంతం చేసుకుంది.
అయితే, జనసేన పార్టీకి ఎందురైన ఘోర పరాజయంపై పవన్ కళ్యాణ్ అపుడే సమీక్షలకు శ్రీకారం చేపట్టారు. పూర్తి స్థాయి సమీక్షలను మాత్రం జూన్ నుంచి చేపట్టనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, ఓటమికి గల కారణాలను జూన్ నెలలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో పవన్ సమావేశమై చర్చించిన విషయం తెల్సిందే.