బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 25 మే 2019 (12:45 IST)

సోమిరెడ్డిని కొంపముంచిన అసహనం... కోపం....

ఏపీ ఎన్నికల్లో జగన్ సునామీలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ మంత్రుల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు. మంత్రిగా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసినప్పటికీ దాదాపు 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ముఖ్యంగా, సర్వేపల్లి ప్రజల మన్ననల కోసం సోమిరెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారు. 
 
రైతులను ఆకర్షించడానికి సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి కాల్వలను తవ్వించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా తన కుమారుడిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి పర్యవేక్షించారు. చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు తమను తప్పక గెలిపించి తీరుతాయని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ విశ్వాసంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు టికెట్టు ప్రకటించిన వెంటనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. కానీ, తుది ఫలితాలను చూసిన ఆయన ఖిన్నుడయ్యాడు. 
 
ఈ ఓటమికి గల కారణాలను ఆయన అనుచరులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ గాలి ఒక కారణం కాగా సోమిరెడ్డి అసహనం, కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకుల స్వార్థం కారణాలనే వాదన వినిపిస్తోంది. అభివృద్ధిపరంగా ఆయన ప్రజల మన్ననలు పొందాలని ప్రయత్నించారు కానీ ద్వితీయ శ్రేణి నాయకులను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. 
 
ఈయన అసహనం.. కోపం కారణాలుగా చూపి కొందరు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరి కొందరు దూరమయ్యారు. జగన్‌ గాలికితోడు కీలకమైన ద్వితీయ శ్రేణి నాయకులు దూరం కావడంతో గెలుస్తాడని భావించిన సోమిరెడ్డి 2014 ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్ల తేడాతో ఓటమి చెందారనే వాదన వినిపిస్తోంది.