మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (16:18 IST)

దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది... కానీ గట్టెక్కుతాం : ప్రధాని మోడీ

దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనివుందనీ, దాని నుంచి గట్టెక్కుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జ‌రిగిన అసోచ‌మ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదారేళ్లు క్రితం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ కూప్ప‌కూలిపోయింద‌ని, కానీ త‌మ ప్ర‌భుత్వం ఆ వ్య‌వ‌స్థ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించి, మ‌ళ్లీ గాడిలో ప‌డేలా చేశామన్నారు. 
 
త‌మ ప్ర‌భుత్వం రైతులు, కార్మికులు, కార్పొరేట్ సంస్థ‌ల ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకుంటోంద‌న్నారు. ప‌న్ను వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకువ‌స్తున్నామ‌ని, పారద‌ర్శ‌క‌త‌, సామ‌ర్థ్యాన్ని, బాధ్య‌తను కూడా పెంచుతున్నామ‌న్నారు. కంపెనీస్ యాక్టులో ఉన్న కొన్ని అంశాల‌ను ఎత్తివేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. 
 
ముఖ్యంగా, వ్యాపారాన్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేసేందుకు ఈ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మోసాల వ‌ల్ల అన్ని వ్యాపారాలు దెబ్బ‌తిన‌వ‌ని, విఫ‌ల‌మైనంత మాత్రాన దాన్ని నేరంగా చూడ‌రాదు అని మోడీ అన్నారు. కంపెనీ మంచి కోసం నిజ‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకునేవారిపై ఎటువంటి త‌ప్పుడు చ‌ర్య‌లు చేప‌ట్ట‌బోమ‌న్నారు. 
 
అలాగే, దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్‌ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోడీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. 
 
రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్టీని తీసుకురావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్‌ మెరుగుపడిందన్నారు. అలాగే ఆర్థికవ్యవస్థ వృద్దితోపాటు, ఆధునికతను జోడించామన్నారు. 
 
ముఖ్యంగా, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ కోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్‌ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం.