శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (12:17 IST)

పౌరసత్వ బిల్లుకు ఆమోదం.. ముస్లిమేతర మతస్తులకు కూడా పౌరసత్వం

కేంద్ర మంత్రివర్గం మరో అత్యంత కీలకమైన బిల్లుకు ఆమోదముద్రవేసింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేంద్ర కేబినెట్ సమ్మతం తెలిపింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాల‌కు చెందిన ముస్లిమేత‌ర మ‌త‌స్తుల‌కు ఈ బిల్లు ద్వారా పౌర‌స‌త్వం క‌ల్పించే అవ‌కాశం కల్పించారు. 
 
ముఖ్యంగా, హిందువులు, క్రిస్టియ‌న్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీ వ‌ర్గాల‌కు చెందిన వారికి పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు ఈ స‌వ‌ర‌ణ బిల్లును తీసుకొచ్చారు. వ‌చ్చే వారం పార్ల‌మెంట్‌లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. కాశ్మీర్‌లో ర‌ద్దు చేసిన ఆర్టిక‌ల్ 370 త‌ర‌హాలోనే ఈ బిల్లు కూడా ముఖ్య‌మైంద‌ని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. 
 
ఎంపిక చేసిన క్యాట‌గిరీల్లో మాత్ర‌మే అక్ర‌మంగా దేశంలోకి చొర‌బ‌డిన వారికి ఆశ్ర‌యం ఇచ్చేందుకు ఈ బిల్లును తీసుకువ‌స్తున్నారు. హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో బీజేపీ స‌భ్యులు అంద‌రూ హాజ‌రుకావాల‌ని ఆ పార్టీ ఆదేశించింది. అయితే, కొన్ని విపక్ష పార్టీలు మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.