చైనాతో సరిహద్దు ఘర్షణ : జపాన్‌తో భారత్ యుద్ధ నౌకల విన్యాసాలు

naval exercise
ఠాగూర్| Last Updated: ఆదివారం, 28 జూన్ 2020 (19:43 IST)
ఒకవైపు, సరిహద్దుల్లో భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు నెలకొనివున్నాయి. ఇరు దేశాల సైనికులు సరిహద్దుల్లో భారీగా మొహరించివున్నారు. ఈ క్రమంలో భారత్ తన మిత్రదేశాల్లో ఒకటైన జపాన్‌తో కలిసి హిందూ మహాసముద్రంలో యుద్ధ నౌకల సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి.

ఓ వైపు తూర్పు లఢక్‌లోని గల్వాన్‌ సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో మిత్ర దేశమైన జపాన్‌తో కలిసి భారత్‌ ఈ నౌకా విన్యాసాల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌, జపాన్‌కు చెందిన యుద్ధ నౌకలు ఇటీవల తరచుగా విన్యాసాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం హిందూ మహాసముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించినట్లు ఇరు దేశాల నావికా దళాలు ప్రకటించాయి. భారత్‌, జపాన్‌ నుంచి రెండేసీ యుద్ధ నౌకలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపాయి.

భారత శిక్షణా నౌకలైన ఐఎన్‌ఎస్‌ రానా, ఐఎన్‌ఎస్‌ కులుష్, జపాన్ నావికాదళానికి చెందిన జెఎస్ కాశీమా, జెఎస్ షిమాయుకి ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మారిటైమ్, సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌పై పరస్పర అవగాహనకు ఈ నౌకా విన్యాసాలు నిర్వహించినట్లు ఇరు దేశాలు తెలిపాయి.

వ్యూహాత్మక సమాచార మార్పిడి కోసం ఈ విన్యాసాలు జరిపినట్లు నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ ప్రదీప్ చౌహాన్ తెలిపారు. ఇది నావికాదళాల పోరాట ప్రయోజనాల కోసం కాదని, కేవలం సిగ్నలింగ్ కోసమేనని ఆయన చెపారు.

కాగా, గత మూడేండ్లలో భా‌రత్‌తో కలిసి సంయుక్త నౌకాదళ విన్యాసాలు నిర్వహించడం ఇది 15వసారి అని ఢిల్లీలోని జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది. దీనికి ఎలాంటి నిర్దిష్టమైన లక్ష్యం లేదని, కేవలం వ్యూహాత్మక సమాచార శిక్షణ కోసం తాజా విన్యాసాలు జరిగినట్లు జపాన్‌ ఎంబసీ ప్రతినిధి తోషిహిడే ఆండో చెప్పారు.దీనిపై మరింత చదవండి :