గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (10:37 IST)

కరోనా విజృంభణ : ఒక్క రోజే 19906 కేసులు.. 410 మంది మృతులు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. లాక్డౌన్ అమల్లోవున్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట ఏమాత్రం పడటం లేదు. ఫలితంగా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. 
 
గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,28,859కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,095కి పెరిగింది. 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,713 మంది కోలుకున్నారు.
 
కాగా, జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 82,27,802 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శనివారం ఒక్కరోజులో 2,31,095 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల నమోదు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. శనివారం ఒక్క రోజే ఏకంగా 1087 కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఏకంగా 888 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత తెలంగాణాలో మొత్తం కేసులు 13,436గా ఉన్నాయి. అలాగే, శనివారం ఆరుగురు రోగులు చనిపోయారు. వీటితో కలుపుకుని మొత్తం మృతుల సంఖ్య 243కి చేరుకుంది.