బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 జూన్ 2020 (15:09 IST)

'మాహిష్మతి'లో బాహుబలి అయినా భళ్లాలదేవుడైనా మాస్క్ ధరించాల్సిందే-video

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజురోజుకీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవాలంటే భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు మాస్కులు ధరించడం తప్పనిసరి. మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకత గురించి బాహుబలి చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తీసుకుని ఇలా చెప్పారు. 
 
దేశవ్యాప్తంగా కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న మార్గాల్లో ప్రధానమైనది మాస్కును ధరించడం. మాస్కులను ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు ఇతరులకు కూడా వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
 
డిస్పోజబుల్ (సర్జికల్) మాస్కులు 97శాతం వరకు, ఇంట్లో తయారు చేసుకున్న కాటన్ మాస్కు 70శాతం వరకు వైరస్ వ్యాప్తిని నిరోధించగల సామర్థ్యం ఉంటాయి. జనాభాలో 80శాతం మంది మాస్కు ధరించినట్టయితే వైరస్ వ్యాప్తిని వెంటనే అరికట్టవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.  అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న నిబంధనలను తీసుకువచ్చారు.
 
అయితే ఎలాంటి మాస్కులు ధరించాలి? వాటిని ఎలా శుభ్రపరిచాలి? మాస్కును పారవేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే వారు ఈ వైరస్ బారినుంచి తమను తాము రక్షించుకోవడంతోపాటు ఇతరులకు సోకకుండా మంచి చేసిన వారు అవుతారు. 
 
అసలు మాస్క్ ఎందుకు ధరించాలి?
కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది.
 
మరికొందరి శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది.  కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ ఏరోసోల్స్‌ (తుంపర్లు)లో మూడు గంటల వరకు ఉంటాయని గుర్తించారు. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. 
 
ఎలాంటి మాస్కులను ఉపయోగించాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. ప్రజలు మెడికల్ లేదా క్లాత్ మాస్క్ ఏదైనా ఉపయోగించవచ్చు. అయితే మెడికల్ మాస్కులను హెల్త్ వర్కర్లు, కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారు మాత్రమే వాడాలని, క్లాత్‌ మాస్కులను కోవిడ్-19 లక్షణాలు లేనివారు వాడాలని సూచించింది.
 
ఒకవేళ  మెడికల్ మాస్కులు వాడినా ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పారవేయాలని, క్లాత్ తో తయారు చేసుకున్న మాస్కులు ఎన్నిసార్లైనా వాడవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. మనం తయారు చేసుకునే క్లాత్ మాస్కు కనీసం మూడు లేదా అంతకంటే ఎక్కువ పొరలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఆ మాస్కు వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉంటుంది. 
 
మాస్కులు ధరించే విధానం:
* మాస్కు ధరించినపుడు ముక్కు, నోరు, గడ్డం మూసి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
* మాస్కు బిగుతుగాను లేక మరీ వదులుగా ఉండకూడదు. ఊపిరి పీల్చుకోడానికి వీలుగా ఉండాలి.
* మాస్కు బయట భాగాన్ని వీలైనంత వరకు చేతులతో ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక దానికి   వైరస్ ఉంటే అది మీ చేతులకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. 
* క్లాత్ మాస్కులను ఉపయోగించే వారిలో చాలా మంది రెండు లేదా మూడు రోజుల పాటు ఉతక కుండా ఉంటారు. మరింకొందరు శానిటైజర్ స్పే చేస్తూ ఉంటారు. అలా చేయడం సరికాదు. 
 
మాస్కులను శుభ్రం చేయడం:
* మనం ధరించే క్లాత్ మాస్కును ప్రతిరోజూ ఉతకాలి. ఫేస్‌ మాస్క్ ను రెండు లేదా మూడురోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్టే. మాస్క్‌ ధరించిన ప్రతిసారి దాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది.  
*  మాస్కులను చన్నీటిలో శుభ్రం చేస్తుంటారు కొందరు. అలాకాకుండా వేడినీళ్లతో మాస్కులను శుభ్రం చేయడం అన్ని విధాలా శ్రేయస్కరం. 
* క్లాత్ తో చేసిన మాస్కులను వాషింగ్‌ మిషన్‌లో వేడినీళ్లు లేదా సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రం చేయాలి. తరువాత ఎండలో ఆరవేయాలి లేదా ఒక గ్యాస్ పై వేడినీటిలో కనీసం 15 నిమిషాలు ఉంచి ఎండలో ఆరబెట్టవచ్చు. 
* ఒకవేళ మాస్కులను చల్లని నీటితో శుభ్రం చేసినా తప్పకుండా ఎండలోనే ఆరేయాలి. ఉపయోగించే ముందు తప్పనిసరిగా ఇస్త్రీ పెట్టెతో వేడి చేసి తర్వాత ఉపయోగించాలి. 
 
మాస్కులు ఎప్పుడు ఎక్కడ ఉపయోగించాలి:
* రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లేప్పుడు తప్పకుండా మెడికల్ లేదా, క్లాత్ మాస్కులు ధరించాలి.
* ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ మాస్కును ధరించడం తప్పనిసరి.
* ఆఫీసులో మనం ఎదుటివారితో మాట్లాడుతున్నపుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. 
* రైల్లు, ట్యాక్సీలు, బస్సుల్లో ప్రయాణించేవారు మస్కును ధరించడంతోపాటు ఇతరులతో భౌతిక దూరం పాటించాలి. 
 
కోవిడ్-19 తో రిస్కు వద్దు- ముఖానికి మాస్కు ముద్దు