కరోనావైరస్ లాక్‌డౌన్: హనీమూన్‌కు మెక్సికోకు వెళ్ళి మాల్దీవుల్లో చిక్కుకున్న కొత్త జంట

couple
బిబిసి| Last Modified శుక్రవారం, 26 జూన్ 2020 (22:24 IST)
ఈజిప్ట్ లోని కైరో నగరానికి చెందిన 36 సంవత్సరాల ఖలీద్, 35 సంవత్సరాల పెరి.. మార్చి 6న బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. దుబాయ్‌లో నివసించే వీరిద్దరూ హనీమూన్ కోసం మెక్సికోలోని కాన్ కున్‌కి వెళ్లారు. అప్పటికి కరోనావైరస్ చింత పెద్దగా వ్యాపించలేదు. వారి హనీమూన్ ప్రణాళికలను కరోనా వైరస్ మార్చేస్తుందని వారు ఊహించలేదు.

మార్చి 19 వ తేదికి టర్కీ మీదుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి వెళ్లేందుకు ప్రయతిస్తున్న సమయానికి ప్రయాణ నిర్బంధనలు నెమ్మదిగా మొదలవుతున్నాయి. మేము విమానం లో ఉండగానే, మేము దుబాయ్ లో దిగే వీలుందో లేదో కనుక్కుంటూ బంధువులు, స్నేహితులు సందేశాలు పంపించారు. అప్పటికే దుబాయ్ విదేశీయులను తమ దేశంలో అడుగు పెట్టనివ్వడం లేదని విన్నామని పెరి బీబీసీ కి చెప్పారు. .


“మమ్మల్ని ప్రయాణం చేయడానికి అనుమతిస్తారేమోనని ఊహించాం. కానీ, ఇస్తాంబుల్ లో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదు”. “మేము మెక్సికోలో బయలుదేరే సమయానికి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. ఈ జంట ఎయిర్ పోర్ట్ లోనే రెండు రోజులు ఉండిపోయారు. టర్కీ లో మేము బయటకి వెళ్లేందుకు మాకు అనుమతి లేదు”.

“బోర్డింగ్ పాస్ లేకుండా మాకు కావాల్సిన టాయిలెట్ సామాన్లు కొనుక్కోవడం కూడా చాలా ఇబ్బందైంది. మా లగేజ్ కూడా తీసుకోలేకపోయాం” అని చెప్పారు. ఒక వైపు యూ ఏ ఇ కి వెళ్లేందుకు అనుమతి లేదు, మరో వైపు ఈజిప్ట్ కి వెళ్లే విమానాలను రద్దు చేశారు. ఆ క్షణంలో వారికేమి చెయ్యాలో అర్ధం కాలేదు. "ఈజిప్ట్ దేశస్థులను వీసా లేకుండా అనుమతించే దేశాల గురించి గూగుల్ లో వెతకడం మొదలుపెట్టామని, పెరి చెప్పారు. అప్పటికి మాకు మాల్దీవులు ఒక్కటే కనిపించింది.

ఇండియన్ ఓషన్‌లో ఉన్న మాల్దీవులు సుందరమైన సముద్ర తీరాలకు పేరు పొందింది. కానీ, ఆ సమయానికి సముద్ర తీరం వారిని ఆకర్షించలేదు. "ఇమ్మిగ్రేషన్లో మాకు అనుమతి దొరకడమే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో కూర్చునే బదులు కనీసం ఒకే గదిలో విశ్రమించవచ్చనే ఆలోచన మాకు చాలా ఆనందాన్నిచ్చింది”.


"మా సామాన్లు మా చేతికి వచ్చాయి." అని టెలికాం ఇంజనీర్‌గా పని చేస్తున్న ఖలీద్ చెప్పారు. “అప్పటికి మేము ఉండటానికి చోటైతే దొరికింది కానీ, మాకు కొత్త సమస్యలు కళ్ళ ముందు కనిపించాయి”. "మేము హనీమూన్‌కని బయలుదేరడంతో మాతో పాటు వర్క్ ల్యాప్‌టాప్స్ తెచ్చుకోలేదని” మీడియాలో పని చేస్తున్న పెరి చెప్పారు.

వాళ్లిద్దరూ రిసార్ట్‌కి వెళ్ళాక అక్కడుండే కొంతమంది అతిధుల్లో వారొకరని అర్ధమయింది. అక్కడున్న చాలామంది వారి వారి ఇళ్లకు వెళ్లిపోవడానికి సంసిద్ధమవుతున్నారు. “అందరూ వెళ్లిపోయేసరికి హోటల్ మూసేసారు. అక్కడి నుంచి మేము మరో దీవికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది.”


ఆఖరికి మాల్దీవులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రభుత్వ ఐసోలేషన్ రిసార్టులో నెలంతా గడపాల్సి వచ్చింది. “రిసార్ట్ యాజమాన్యం తగ్గించిన ధరలతో మాకు సౌకర్యాలు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు. మా కోసం రిసార్ట్ సిబ్బంది సాయంత్రం పూట మ్యూజిక్ ప్లే చేసేవారు. ఒక్కొక్కసారి ఎవరూ డాన్స్ చేయటం లేదని వాళ్ళు బాధపడే వారు.”

"మాతో పాటు రిసార్ట్‌లో మరో 70 మంది ఉండేవారు. అందులో చాలామంది మాలాగే హనీమూన్‌కి వచ్చినవారే. కాకపొతే, వారు హనీమూన్‌కి రిసార్ట్‌కే వస్తే మేము వేరే దేశం నుంచి వచ్చి అక్కడ చిక్కుకున్నామని పెరి చెప్పారు. మాల్దీవులలో లాక్ డౌన్ ప్రకటించే సమయానికి 300 మంది పర్యాటకులు ఉండిపోయారు. వారికి దుబాయ్ ఎలా అయినా వెళ్లాలని బలంగా అనిపించింది.


వర్షాకాలం కావడంతో వారు రెండుసార్లే బీచ్‌కు వెళ్లినట్లు చెప్పారు. అంతేకాకుండా, వారు రమదాన్ ఉపవాసం కూడా చేస్తున్నారు. వారు ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు కానీ, వైఫై సరిగ్గా లేకపోవడం వలన కాన్ఫరెన్స్ కాల్స్‌లో పాల్గొనడం కష్టమయ్యేది. గల్ఫ్ దేశాలకి విమాన సేవలు మొదలైన తర్వాత, వారు యుఏఇ పౌరులు కాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లడం అంత సులభం కాలేదు.

ఇక వారి దగ్గర మిగిలిన అవకాశం ఈజిప్ట్ వెళ్లి, అక్కడ 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉండటమే. యుఏఇ అధికారులకు ఫోన్లు చేసి వారి ఇబ్బందులు తెలపాల్సి వచ్చింది. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా వారి వివరాలను నమోదు చేశారు. వారికింకా అనుమతి రావాల్సి ఉంది. వారికి వెళ్ళడానికి విమానాలు కూడా లేవు. ప్రతి సారి విమానాలు ఎప్పటి నుంచి తిరుగుతాయో వార్తల్లో చూసుకోవడం కూడా చాలా ఒత్తిడిగా ఉంటోంది. దేశానికి తిరిగి వెళ్ళాక ఒక వేళ క్వారంటైన్లో ఉండవలసి వస్తే ఉంటామని పెరి చెప్పారు.

ఈ లోపు వారికవుతున్న ఖర్చు గురించి లెక్క పెట్టుకోకూడదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. వారు ఇంటికి ఎప్పటికి చేరుతారో ఇంకా అర్ధం కావటం లేదు. ప్రపంచంలో ఇంకా చాలామంది వారి కంటే కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారని తెలుసు. కానీ, ఈ హనీమూన్ అనుకున్న దాని కంటే ఎక్కువ రోజులు సాగుతోంది.


"ఒక రిసార్ట్‌లో మిగిలిన అతిధులు అంతా వెళ్లిపోతుంటే మీరొక్కరే మిగిలిపోతే ఎలా ఉంటుందని” ఖలీద్ ప్రశ్నించారు. “ఇలాంటి స్థలాల్లో ఎక్కువ మంది ఉంటేనే బాగుంటుంది. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. మేము మాల్దీవుల్లో చిక్కుకున్నామని ఎవరితోనన్నా చెబితే వారు అదేమంత ఇబ్బంది పడే విషయం కాదని నవ్వుతున్నారు. నీ పరిస్థితిలో మేమంటే బాగుంటుందని అన్నారు” అని పెరి చెప్పారు.

“కానీ, ఇది చాలా ఒత్తిడితో కూడుకున్నదని అన్నారు. ఇంట్లో కుటుంబంతో ఉండటం కన్నా ఆనందమైన విషయం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నేను కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యం ఇస్తాను”.

దీనిపై మరింత చదవండి :