గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (09:15 IST)

కాఫీ కింగ్ సిద్ధార్థను కొట్టి చంపేశారా? ముక్కులోని రక్తం ఎందుకు వస్తుంది?

కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కార్పొరేట్ రంగంలో పెనుసంచలనంగా మారింది. రూ. వేల కోట్లకు అధిపతి అయిన సిద్ధార్థ... ఇపుడు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని ఇటీవల నేత్రావతి నదీ తీరంలో స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ మృతిపై మంగుళూరు  సౌత్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, నదిలో నుంచి కొట్టుకొచ్చిన మృతదేహంపై ఫ్యాంటు, బూట్లు, చేతి ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. ఆయన వేసుకున్న టి.షర్ట్ లేదు. ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న తర్వాత 36 గంటలు గడిచినా, మృతదేహం దెబ్బతినలేదు. పైగా ముక్కు నుంచి రక్తం కారుతున్న గుర్తులు తాజాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడదే పోలీసులకు కొత్త అనుమానాలు వచ్చేలా చేస్తోంది. 
 
దీంతో సిద్ధార్థతో వ్యాపారలావాదేవీలు కలిగిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నట్టు సౌత్ ఏసీపీ వెల్లడించారు. అంతేకాకుండా, భారత కార్పొరేట్ వర్గంలోని పలువురు ప్రముఖులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటుండటం గమనార్హం. ఇక ఆయనది అందరూ అనుకుంటున్నట్టు ఆత్మహత్యా? కాదా? అన్నది పోలీసుల విచారణే తేల్చాలి.
 
అదేసమయంలో సిద్ధార్థ కారు డ్రైవర్ బసవరాజు కూడా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. తమ యజమాని అదృశ్యమైన గంటన్నర తర్వాతే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సమయంలో సిద్ధార్థ ఫోన్లో మాట్లాడుతూ కాసేపు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించారని, ఆపై అదృశ్యం అయ్యేసరికి, తాను కాసేపు చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశానని బసవరాజు చెపుతున్నాడు. ఆ సమయంలో సిద్ధార్థ ఎవరికి ఫోన్ చేశాడన్న విషయం విచారణలో కీలకం కానుంది.