గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (13:42 IST)

గుమ్నామీ బాబా అనే సాధువే.. నేతాజీ సుభాష్‌ చంద్రబోసా?

నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌.. 76 ఏండ్లు గడిచినా ఆయన మరణం ఇంకా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తైపీలో 1945లో ఇదే రోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చరిత్రకారులు నమ్ముతున్నారు. అయితే, దానికి సంబంధించిన అధికారిక పత్రాలేవీ అందుబాటులో లేవు. అయితే, అజ్ఞాతంలో గడిపారని మరికొందరు చరిత్రకారులు చెప్తుంటారు. ఇన్నేండ్లయినా ఆయన మరణం గురించి అనుమానాలు ఇంకా మన మదిలో కొనసాగుతూనే ఉన్నాయి.
 
 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్‌ నుంచి మంచూరియాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం కనుమరుగై పోయింది. దాంతో ఆయన ఆ ప్రమాదంలో చనిపోయారని భావిస్తున్నారు. అయితే, తాయ్‌హోక్‌ విమానాశ్రయం వద్ద జరిగిన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని ఐదు రోజుల తర్వాత టోక్యో రేడియో ఒక వార్తను ప్రసారం చేసింది. 
 
ఈ ప్రమాదంలో నేతాజీ శరీరం పూర్తిగా కాలి బూడిదైందని కూడా తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించారని భావిస్తున్న నేతాజీ చితాభస్మాన్ని ఈనాటికీ టోక్యోలోని రంకోజీ దేవాలయంలో భద్రపరిచారు. అయితే, 1945 లో తమ భూభాగంలో ఎలాంటి విమాన ప్రమాదం జరుగలేదని తైవాన్‌ ప్రభుత్వం ఆ తర్వాతి కాలంలో స్పష్టం చేసింది.
 
76 సంవత్సరాలు పూర్తికావస్తున్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణం ఇవ్వాల్టికీ మిస్టరీగానే ఉంది. ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఇప్పటివరకు మూడు కమిషన్లు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. ఆయన ఎలా చనిపోయారో గుర్తించాలని అప్పట్లో నియమించిన జస్టిస్ ఎంకే ముఖర్జీ ఏక సభ్య కమిషన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. 
 
సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, కానీ ఆయన ఎలా చనిపోయారో గుర్తించలేకపోతున్నామని ఈ కమిషన్ తేల్చింది. ఇలాఉండగా, 1960-87 మధ్యకాలంలో అయోధ్య సమీపంలోని ఫైజాబాద్‌లో నివసించిన గుమ్నామీ బాబా అనే సాధువే.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని చాలా మంది నమ్మడం విశేషం.