అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అంబులెన్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న వైద్యుడు, నవజాత శిశివు, చిన్నారితండ్రి, నర్సు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రంలోని అర్వల్లీ జిల్లా మొదాస పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
పుట్టిన తర్వాత నవజాత శిశువు అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం పసికందును మొదాసలోని ఓ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మొదాస - ధన్సురా రహదారిపై అంబులెన్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ (38), డాక్టర్ శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మానత్ (23)లతో పాటు నవజాత శిశువు సజీవదహనమయ్యారు.
ముందుభాగంలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ అంకిత్ ఠాకూర్, జిగ్నేష్ బంధువు గౌరంగ్ మోచీ, గీతాబెన్ మోచీలు గాయాలతో బయటపడ్డారు. వెనుక భాగంలో ఉన్న నలుగురూ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపు జరగరాని నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి కూడా తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులు రంగంలోకి దిగారు.