బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (08:04 IST)

రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందు వధువు హత్య చేసిన వరుడు.. ఎక్కడ?

murder
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో దారుణం జరిగింది. వివాహ రిసెప్షన్‌కు కొన్ని గంటల ముందు వధువును వరుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా అదే గదిలో ఉరేసుకున్నాడు. మరికొన్ని గంటల్లో రిసెప్షన్‌కు హాజరుకావాల్సిన ఈ జంట రక్తపు మడుగులో కనిపించడం కలకలం రేపింది. వధువును వరుడే హత్య చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
రాయ్‌పూర్‌లోని బ్రిజ్ నగర్‌కు చెందిన అస్లాం (24), కహకషా బానో (24) అనే వారికి ఆదివారం వివాహం జరిగింది. బుధవారం రాత్రి రిసెప్షన్ జరగాల్సివుంది. ఇందుకోసం ముస్తాబయ్యేందుకు ఈ నూతన దంపతులు ఓ గదిలోకి వెళ్లారు. ఎంతసేపటికి వీరుబయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి తలుపు కొట్టారు. తలుపు తీయకపోగా లోపల గడియ పెట్టివుంది. 
 
దీంతో మరో యువకుడు కిటికీలోని గదిలోకి ప్రవేశించి చూడగా, ఆ దంపతులు రక్తపు మడుగులో పడివుండటాన్ని చూసి బిగ్గరగా కేకలు వేస్తూ నిర్ఘాంతపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని తలుపు తీశాడు. ఈ సమాచారం పోలీసులకు చేరవేయగా, వారు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
రిసెప్షన్‌కు ముస్తాబయ్యేందుకు గదిలోకి వెళ్లిన ఈ దంపతుల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగివుంటుందని, దీంతో ఆగ్రహానికి గురైన వరుడు ఆమెను హత్య చేసివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.