అసెంబ్లీ సమావేశాలకు.. జీన్స్, టీషర్ట్ ధరించి వస్తారా? ఫైర్ అయిన స్పీకర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడాసమా గుజరాత్ బడ్జెట్ సమావేశాలకు జీన్స్, టీషర్ట్ ధరించి రావడంపై రచ్చ జరిగింది. ఈయన బ్లాక్ ఫ్రీ నెక్ టీ షర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఇంతలో ఈ అంశంపై శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది.. సభ గౌరవాన్ని అందంగా తీర్చిదిద్దే దుస్తులు ధరించి రావాలని ఆదేశించారు. తాను ధరించిన దుస్తులు తగినవి కావని తెలిపే చట్టాలేమైనా ఉన్నాయా? ఉంటే చూపాలని అని విమల్ చూడాసమా పట్టుబట్టారు.
స్పీకర్ ఆదేశాలను ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని హోంమంత్రి ప్రదీప్సింగ్ జడేజా ప్రతిపాదించారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సంస్కృతి, సాంప్రదాయానికి అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది.. బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు.
అయితే, స్పీకర్ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడాసమా నలుపు రంగు ఫ్రీ నెక్ టీషర్ట్ జీన్స్ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఈయన దుస్తులను గమనించిన స్పీకర్ రాజేంద్ర త్రివేది ఒక్కసారి మండిపడ్డారు.
దీనిపై స్పందించిన విమల్ చూడాసమా.. ఇలాంటి దుస్తులు ధరించకూడదని చట్టంలో ఎక్కడైనా ఉన్నదా? మీరైమైనా చట్టం తీసుకొచ్చారా? తీసుకొస్తే చూపించండి.. అంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో సభను వీడి వెళ్లాలని చూడాసమాను స్పీకర్ సూచించారు. అందుకు ససేమిరా అనడంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి విమల్ చూడాసమాను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.