సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2019 (18:03 IST)

చిద్దూకు తేరుకోలేని షాక్... బహిరంగ ప్రదేశంలో అరెస్టు వద్దన్న కోర్టు

ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి మరోమారు గట్టి షాక్ తగిలింది. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. చిదంబరాన్ని కస్టడీలోనే విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని ఈడీ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది.
 
ఈ నేపథ్యంలో చిదంబరాన్ని ఈడీ బుధవారం అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న 74 యేళ్ళ చిదంబరం సెప్టెంబరు 5వ తేదీ నుంచి తీహార్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో చిదంబరాన్ని విచారిస్తున్న ఈడీ అధికారికంగా అరెస్టు చేసేందుకు, కస్టడీ కోసం సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి అజయ్ కుమార్ కుహర్ అరెస్టుకు అనుమతించారు. దీంతో బుధవారం చిదంబరంను ఈడీ అరెస్టు చేసి, ఆ తర్వాత ఆయన వద్ద విచారణ జరుపనుంది. 
 
అయితే, చిదంబరాన్ని కోర్టు ప్రాంగణంలోనే అరెస్టు చేసేందుకు ఈడీ అనుమతి కోరగా, న్యాయమూర్తి తిరస్కరించారు. ప్రముఖ వ్యక్తిని బహిరంగ ప్రదేశంలో విచారించి అదుపులోకి తీసుకోవడం గౌరవంగా ఉండదని కోర్టు ఈడీకి సూచించింది.