కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో కొత్త విద్యా సంవత్సరం 2023-24కు గాను వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ప్రకటనను జారీ చేశారు. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ రాత్రి 7గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయస్సు మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉండాలని స్పష్టం చేసింది. ఈ వయస్సును నూతన జాతీయ విద్యా విధానం కింద ఆరేళ్లకు పెంచారు.
కేవీల్లో సీటు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రాథమిక /వెయిటింగ్ తొలి జాబితాను ఏప్రిల్ 20న విడుదల చేసి ఏప్రిల్ 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు రెండో, మూడో జాబితాలను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
అలాగే, రెండు, ఆ పైతరగతుల్లో ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 12వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపింది. పూర్తి వివరాలను https://kvsangathan.nic.in వెబ్‌సైట్‌ను చూసి తెలుసుకోవచ్చని పెర్కొంది.