నేడు చెన్నైలో వన్డే మ్యాచ్ : ప్రపంచ రికార్డులకు చేరువలో భారత క్రికెటర్లు
స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు వన్డే మ్యాచ్‌లలో ఇరు జట్లూ ఒక్కో మ్యాచ్‌లో గెలుపొంది సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నై వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ సిరీస్‌లో పెద్దగా రాణించని జట్టు కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ కోహ్లీల ముందు ఓ ప్రపంచ రికార్డు వేచి ఉంది. వీరిద్దరూ కలిసి మరో 2 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన జంటగా నిలువనుంది.
వన్డేల్లో 85 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ - కోహ్లీ జంట ఇప్పటివరకు 4,998 పరుగులు చేసింది. ఇక ఈ మూడో వన్డేలో మరో రెండు పరుగులు జోడిస్తే అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు చేసిన జంటగా వీరు చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటివరకూ ఈ రికార్డు వెస్టిండీస్ జంట గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ పేరిట ఉంది. వీరు మొత్తం 97 ఇన్నింగ్స్‌లో ఈ మైలు రాయి చేరుకున్నారు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా జంట మాథ్యూ హెడెన్ - గిల్‌క్రిస్ట్ (104 ఇన్నింగ్స్) ఉంది. ఇక ఈ జాబితాలో నాలుగు వేలకంటే ఎక్కువ పరుగులు చేసిన వారిని తీసుకుంటే.. 60 కంటే ఎక్కువ యావరేజ్ ఉన్న ఏకైక జంట రోహిత్-కోహ్లీనే కావడం విశేషం. ఇక వన్డే క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన జంట జాబితాలో రోహిత్-కోహ్లీ 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో సచిన్ - గంగూలీ 8227 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు.