కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులోని నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. ఆస్పత్రి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య కేసులో రియాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా, సోమవారం ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ కేసు ఇంతటితో ముగిసిపోయింది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. నిందితుడు రియాజ్‌ను అరెస్టు చేసిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం ఎక్స్‌రే కోసం తీసుకెళుతున్నారు. ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు తెలిపారు.
మూడు రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్‌ను దారుణంగా హత్య చేసిన రియాజ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించగా, ఆదివారం సారంగపూర్ అటవీ ప్రాంతంలోని ఓ లారీలో అతను దాగివున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. రియాజ్ ఎన్‌కౌంటరులో చనిపోవడంతో ఇతర ఖాకీలు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.