శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (17:22 IST)

భూగర్భ నీటికి వృథా చేస్తే ఐదేళ్ళ జైలుశిక్ష.. ఎక్కడ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మున్ముందు నీటి సమస్య ఉత్పన్నమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్రం ఇప్పటి నుంచే మేల్కొంది. ఇందుకో భూగర్భ నీటిని వృథా చేస్తే ఇక సహించదు. నీటి వృథా చేసినట్టు తేలితే ఐదేళ్ళ జైలుశిక్షతో పాటు.... లక్ష రూపాయల మేరకు అపరాధం కూడా విధించనున్నారు.
 
తాజాగా, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పరిథిలోని కేంద్ర భూగర్భ జలాల అథారిటీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం భూగర్భ జలాలను వృథా చేస్తే ఒక లక్ష రూపాయల వరకు అపరాధం విధిస్తారు. అలాగే, ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986లోని సెక్షన్ 5 ప్రకారం ఈ నోటిఫికేషన్‌ను జారీచేయడం జరిగింది. 
 
జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఇటీవల ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ను జారీచేశారు. రాజేంద్ర త్యాగి అండ్ ఫ్రెండ్స్ (ఎన్‌జీవో) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ ఈ ఆదేశాలు ఇచ్చింది. నీటిని వృథా చేయడం, దుర్వినియోగం చేయడం శిక్షించదగిన నేరంగా పరిగణించాలని పిటిషనర్ కోరారు. 
 
ఈ నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, జల మండలులు, జల నిగమ్‌లు, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నీటి వృథాను, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టవలసి ఉంటుంది. భూగర్భ జలాలను దుర్వినియోగం, వృథా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
 
ఇదే అంశంపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ మాట్లాడుతూ, ఓవర్‌హెడ్ ట్యాంకుల వంటివాటిలో నీటిని నింపేటపుడు, మరుగుదొడ్లలో నీటిని వాడేటపుడు, వంట గదుల్లో నీటిని వినియోగించేటపుడు నీరు వృథా అవుతున్నట్లు తెలిపారు. 
 
ప్రజానీకానికి నీటి వినియోగంపై అవగాహన లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. ఇకపై నీటిని వృధా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.