ఒడిశా రైలు ప్రమాద మృతులను గుర్తించేందుకు కృత్రిమ మేథ
ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి మృతులను గుర్తించడం క్లిష్టంగా మారింది. దీంతో కృత్రిమ మేథ సాయంతో ఈ మృతులను గుర్తించే విషయంపై అధికారులు దృష్టిసారించారు.
ఈ ఘటనలో గుర్తింపునకు నోచుకోని మృతుల విషయంలో అధునాతన సాంకేతికతపై రైల్వేశాఖ ఆధారపడుతోంది. వేలిముద్రలు, సిమ్‌కార్డులు సహా సాంకేతికంగా ఏ చిన్న ఆధారం లభ్యమైనా మృతదేహాలను ఆయా కుటుంబాలవారికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోంది.
మొత్తం 288 మంది మృతుల్లో 83 మంది గుర్తింపు ఇంతవరకు పూర్తికాలేదు. మృతుల వేలిముద్రలు సేకరించి, వారి ఆధార్ వివరాల ద్వారా కుటుంబ సభ్యుల గురించి తెలుసుకునేందుకు 'విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (ఉడాయ్) బృందాన్ని బాలేశ్వర్‌కు పిలిపించాలని తొలుత భావించారు. చాలామంది చేతుల వేళ్లు బాగా దెబ్బతినడంతో అది ఫలించలేదు. దీంతో కృత్రిమ మేథస్సు ఆధారంగా పనిచేసే సంచార్ సాథీ పోర్టల్‌ను ఉపయోగిస్తున్నారు.
మొత్తం 64 మృతదేహాల విషయంలో ఈ పోర్టల్‌పై ఆధారపడగా 45 కేసుల్ని విజయవంతంగా గుర్తించగలిగింది. వినియోగదారులు తమ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుసుకునేందుకు, పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్లను బ్లాక్ చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను ఉద్దేశించిన విషయం తెలిసిందే. ఐటీ శాఖకూ మంత్రిగా ఉన్న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవే దీనిని ఇటీవల ప్రారంభించారు.
మృతుల ఫొటోల ఆధారంగా వారి ఫోన్ నంబర్లు, ఆధార్ వివరాలను ఈ పోర్టల్ సమకూర్చింది. వీటి ఆధారంగా కుటుంబ సభ్యుల్ని సంప్రదించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు అక్కడి సెల్‌ఫోన్ టవర్ల ద్వారా ఏయే కాల్స్ వెళ్లాయో తెలుసుకుని, ఆ తర్వాత ఆగిపోయిన ఫోన్లతో ఆ వివరాలను క్రోఢీకరించే ప్రయత్నం చేస్తున్నారు.