నవ వధువును ఒంటరిదాన్ని చేసిన ఒడిశా రైలు ప్రమాదం
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం నవ వధువును ఒంటరిదాన్ని చేసింది. బీహార్‌కు చెందిన రూప అనే మహిళ.. ఈ దుర్ఘటనలో తన భర్త అఖిలేశ్ కుమార్ యాదవ్‌ను కోల్పోయింది. 22 ఏళ్ల అఖిలేశ్.. బహదూర్‌పుర్ బ్లాక్‌లోని మనియారి గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నైలో జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. మే 7వ తేదీన.. రూపతో అఖిలేశ్ వివాహం జరిగింది.
అనంతరం బతుకుదెరువు కోసం చెన్నై వెళుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం అధికారులు ఆధార్ కార్డ్ ద్వారా అఖిలేశ్‌ను గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సిందిగా వారికి సూచించారు.
అఖిలేశ్ మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్త మరణంతో రూప గుండెలు పగిలేలా రోదిస్తోంది. అతడి మృతదేహాన్ని ఇంటికి తెచ్చేందుకు కుటుంబసభ్యులు ఒడిశాకు బయలుదేరి వెళ్లారు.