1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (10:55 IST)

ప్రజల దృష్టి మళ్లించేందుకే తెరపైకి కుట్ర కోణం : సీబీఐ మాజీ డైరెక్టర్

nageswara rao
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘోర ప్రమాదంపై దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు, కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు ఆరోపించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో కుట్రకోణం ఉందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే అధికారులకు ఈ అలవాటు పరిపాటిగా మారిందన్నారు. 
 
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఐటీ సెల్‌‍లోని పెయిడ్ ఆర్టిస్టులు దానికి అన్ని రకాలుగా అబద్దాలు గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు అంటూ సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో విమర్శలు గుప్పించారు. 
 
గతంలో తాను రెండు రైల్వే పోలీసు జిల్లాలకు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీస్ అదనపు డీజీపీగా పని చేసిన అనుభవంతో చెబుతున్నాను. ఎపుడు రైలు ప్రమాదం జరిగినా ప్రజల దృష్టిని మళ్లించేందుకు, వారి లోపాల్ని, అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుట్ర జరిగిందని చెప్పడం రైల్వే అధికారులకు అలవాటైన ఎత్తుగడ. దర్యాప్తు నివేదిక వచ్చేసరికి ప్రజలు ఈ ప్రమాద విషయాన్ని మరిచిపోతారు" అని అన్నారు. ఈ రైలు దుర్ఘటనకు మతాన్ని జోడించి చేస్తున్న ప్రచారమనే మాయలో పడొద్దని ప్రజలను ఆయన కోరారు.