శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 జనవరి 2018 (17:13 IST)

ఢిల్లీలో సంచలనం : 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగినందుకు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు.

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగినందుకు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. 
 
20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఈ 20 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, ఈ 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని, వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల క్రితం సిఫారసు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఎన్నికల కమిషన్ సిఫారసు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ తమ ఎమ్మెల్యేల వాదనను వినకుండానే ఇటువంటి చర్య తీసుకున్నారని ఆరోపించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్యోతి నిర్ణయం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించింది. రాష్ట్రపతి తమ ఎమ్మెల్యేల వాదనను వినాలని కోరింది. కానీ చివరికి రాష్ట్రపతి కూడా ఎన్నికల సంఘం సిఫారసులను ఆమోదించడంతో ఆప్ 20 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది.