బల్లిలా వుండే తక్షక్ పామును స్మగ్లింగ్ చేసి.. విషంతో..?
అరుదైన పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలున్నాయి.
ఈ క్రమంలోనే తక్షక్ పామును వారికి అమ్మేందుకు రూ.9కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు.
అతని బ్యాగులో తక్షక్ పామును పోలీసులు గుర్తించారు. ఈ పాము అత్యంత విషపూరితమైనదని.. చూసేందుకు బల్లిలా వుండే ఈ తక్షక్ పాములను సేకరించి ఆ విషాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఇవి భారీ ధర పలుకుతాయని పోలీసులు తెలిపారు.