మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (12:38 IST)

పీవీ సింధుకు పార్లమెంట్ ఉభయ సభల్లో అభినందనలు

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాయి. 
 
వరుసగా రెండు ఒలింపిక్స్ పోటీల్లో పతకం సాధించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సింధును పార్లమెంటు ఉభయభలు అభినందించాయి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి.
 
సభ ప్రారంభమైన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సింధు సాధించిన ఘనత గురించి సభలో ప్రస్తావించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కాంస్య పతకాన్ని సాధించడం సంతోషకరమని స్పీకర్ అన్నారు. 
 
ఒలింపిక్స్‌లో ఆమెకు వరుసగా ఇది రెండో పతకమని చెప్పారు. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయ మహిళ సింధు కావడం విశేషమని అన్నారు. చారిత్రాత్మకమైన విజయం అందుకున్న సింధుకు యావత్ దేశం తరపున అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు. 
 
మరోవైపు పెద్దలసభలో కూడా సింధు సాధించిన విషయం గురించి మాట్లాడుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. తన అద్భుత ప్రదర్శనతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పారు.