శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (17:23 IST)

పోరాడి ఓడిన పీవీ సింధు : కాంస్య పతకం కోసం చివరి ఆట

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు మరో నిరాశాజనకమైన ఫలితం ఎదురైంది. స్వర్ణం పతకం సాధిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లో ఓటమిపాలైంది. వరల్డ్ నెంబర్ తై జు యింగ్ (చైనీస్ తైపే)తో శనివారం మధ్యాహ్నం జరిగిన పోరులో సింధు 18-21, 12-21తో పరాజయం పాలైంది. 
 
నువ్వే నేనా అన్న‌ట్లుగా ప్ర‌తి పాయింట్ కోసం పోరాడారు. మ‌ళ్లీ స్కోర్ 16-16కు చేరుకున్న‌ది. తొలి గేమ్‌ను తైజు యింగ్ 21-18 స్కోర్ తేడాతో 21 నిమిషాల్లో సొంతం చేసుకుంది. 
 
నిజానికి తొలి గేమ్‌లో పోరాడిన సింధు, రెండో గేమ్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా, ఆపై క్రమేణా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. శక్తిమంతమైన షాట్లు, తెలివైన క్రాస్ కోర్టు ఆటతీరుతో తై జు యింగ్ మ్యాచ్‌ను తన వశం చేసుకుంది. 
 
ఇక సింధు రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌లో ఆడనుంది. 2016లో రియో ఒలింపిక్స్‌లో సిల్వ‌ర్ సాధించిన సింధు.. టోక్యోలో మాత్రం కాంస్య ప‌త‌కం కోసం పోటీప‌డ‌నున్న‌ది.