సోమవారం, 10 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 నవంబరు 2025 (10:56 IST)

థార్ వాహనం నడిపేవారిని అస్సలు వదిలిపెట్టం : హర్యానా డీజీపీ

op singh
ప్రముఖ ఆటోమొబైల్ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తయారు చేసిన థార్ ఎస్‌యూవీ వాహనం ఇపుడు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న వాహనాల్లో ఒకటిగా నిలిచింది. దీనిపై హర్యానా డీజీపీ ఓపీ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థార్ ఎస్‌యూవీ వాహనం ఇపుడు ఒక స్టేటస్ సింబల్‌గా మారిందన్నారు. ఈ వాహనాన్ని నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని.. అది వారికి ఓ స్టేటస్‌ సింబల్‌గా మారిందన్నారు. 
 
గురుగ్రామ్‌లో వాహనాల తనిఖీల సమయంలో ఆయన మాట్లాడుతూ, తనిఖీల సమయంలో బుల్లెట్‌ బైక్‌లు, థార్‌ నడిపే వారిని అస్సలు వదిలేయలేమని డీజీపీ వెల్లడించారు. 'మేము అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ, బుల్లెట్‌ బైక్‌, థార్‌ అయితే మాత్రం అసలు వదలం. వాహనం ఎంపిక వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. థార్‌ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తున్నారు. అసలు కేవలం అది ఓ కారు కాదు.. స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది' అని ఓపీ సింగ్‌ పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా థార్‌ను నడుపుతూ ఇటీవల ఓ ఏసీపీ కుమారుడు వ్యక్తిని ఢీకొట్టిన ఘటన గురించి ఆయన వివరించారు. తన కుమారుడిని రక్షించాలని సదరు అధికారి వేడుకున్నట్లు వెల్లడించారు. ఆ కారు ఏసీపీ పేరుమీదే ఉన్నట్లు పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆ అధికారి ఓ మోసగాడని సింగ్‌ వ్యాఖ్యానించారు.
 
ఈ క్రమంలో పక్కన ఆయనతో పాటు ఉన్న పోలీసుల వైపు తిరిగి.. డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల్లో ఎవరెవరి దగ్గర థార్‌ వాహనాలున్నాయో లిస్ట్‌ తయారు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఎవరి దగ్గర అది ఉంటే వాళ్లు క్రేజీ అని వ్యాఖ్యానించారు. హర్యానాలో థార్‌ వాహనాలు వేగంగా నడపడం కూడా ఓ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డీజీపీ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.