సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (16:44 IST)

మోడీజీ... ఐయామ్ సో సారీ.. నేను రాలేను : మమతా బెనర్జీ

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకూడదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రానికి హాజరుకావాల్సిందిగా పీఎంవో నుంచి మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందింది. దీంతో ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయించారు. రాజ్యాంగపమరైన కార్యక్రమం కావడంతో హాజరుకావాలని నిర్ణయించారు. 
 
అయితే, 24 గంటలకు తిరక్కముందే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తన నిర్ణయానికి గల కారణాలను కూడా ఆమె వెల్లడించారు. 
 
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో 54 మంది కార్యకర్తలు మరణించినట్టు బీజేపీ ప్రకటించింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా ఛానెల్స్ కూడా ప్రముఖంగా ప్రచురించాయి. దీంతో ప్రాణాలు కోల్పోయిన 54 మంది కుటుంబ సభ్యులను కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ ఆహ్వానించారు. దీన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ప్రమాణ స్వీకారం అనేది ప్రజాస్వామ్య పండుగలాంటిది. అలాంటి కార్యక్రమం ఏ పార్టీని కించపరిచేలా ఉండకూడదని మమత తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
"కొత్త ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు. రాజ్యాంగపరమైన ఆహ్వానాన్ని అంగీకరించి ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని అనుకున్నాను. అయితే, చివరి నిమిషంలో బెంగాల్‌లో జరిగిన హింసాకాండలో 54 మంది ప్రాణాలు కోల్పోయారంటూ బీజేపీ చెప్పినట్టు మీడియాలో వచ్చిన వార్తలు చూశాను. ఇది పూర్తిగా అబద్ధం. బెంగాల్‌లో రాజకీయ హత్యలు జరగలేదు. 
 
వ్యక్తిగత శత్రుత్వం, కుటుంబ కలహాలు, ఇతర వివాదాలు ఈ మరణాలకు కారణం కావచ్చు. వీటితో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి రికార్డు కూడా మా దగ్గర లేదు. బీజేపీ చేసిన క్లెయిమ్‌ వల్లే ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురైందని చెప్పడానికి చింతిస్తున్నాను. మోడీజీ... ఐయామ్ సో సారీ" అంటూ మమతా బెనర్జీ ఆ ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.