బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (17:13 IST)

ప్లీజ్.. మీ అభిప్రాయం చెప్పండి : 'మాజీ దిగ్గజాలకు' మోడీ ఫోన్

కరోనా వైరస్ మహమ్మారి నుంచి దేశాన్ని, దేశ ప్రజలను రక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహర్నిశలు పోరాడుతున్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. నిత్యం వైద్య నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే, తన మంత్రివర్గ సహచరులకు, ఆరోగ్య శాఖ అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు జారీ చేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
అలాగే, తనవంతు కృషిగా ఇలాంటి కష్టకాలంలో దేశ ప్రజలందరినీ ఐక్యంగా ఉంచుతూ, ఏకతాటిపైకి తెచ్చేందుకు పాటుపడుతున్నారు. ఇందులోభాగంగానే మార్చి 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వగా అది విజయవంతమైంది. ఇపుడు ఏప్రిల్ 5వతేదీ రాత్రి 9 గంటల 9 నిమిషాలకు గృహాల్లోని విద్యుత్ దీపాలను ఆర్పివేసి, క్యాండిల్స్, నూనె దీపాలను వెలిగించాలంటూ పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు అనేక మంది మద్దతునిచ్చారు.
 
ఇదిలావుంటే, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం స్వయంగా ఫోన్లు చేశారు. కరోనా వ్యాప్తి నివారణ, సహాయక చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కరోనా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు. పలువురు రాజకీయనేతలతో మోడీ స్వయంగా ఫోనులో మాట్లాడారు. 
 
ఇందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వెస్ట్ బెంగాల్ సీఎ మమతా బెనర్జీ, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఇలా అనేక రాజకీయ పార్టీల నేతలకు ఆయన ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తీసుకున్నారు.