ఆపరేషన్ సిందూర్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని మోడీ
పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత త్రివిధ దళాలు చేపట్టిన దాడును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం అర్థరాత్రి స్వయంగా పర్యవేక్షించారు. పాకిస్థాన్‌లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలో పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. అయితే సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.
మరోవైపు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైన్యం చేస్తున్న దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Security Advisor Ajit Doval) మాట్లాడారు. మరో వైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భార్-పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు. అలాగే, బుధవారం ఉదయం ప్రధాని మోడీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం జరగనున్నట్టు సమాచారం.