గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 జూన్ 2024 (10:36 IST)

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ : రాత్రి 7.15 గంటలకు ప్రమాణం...

narendra modi
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో ఆయన ఆదివారం ఉదయం మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని వాజ్‌పేయికి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. రాజ్‌ఘాట్, సదైవ్ అటల్‌కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. 
 
మరోవైపు, ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. శని, ఆదివారం రెండు రోజులు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మోడీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
 
ఇదిలాఉంటే.. మోదీతో పాటు బీజేపీ సహా ఎన్డీఏ పక్షాల నుంచి సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని ఎన్డీటీవీ వెల్లడించింది. అయితే, హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుగా బీజేపీ నేతలే ఉంటారని తెలిపింది. మొత్తంగా కేంద్ర కేబినెట్ 78 నుంచి 81 మందితో కొలువుదీరనుందని పేర్కొంది. ఏపీ నుంచి యువ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, తొలిసారి ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు చోటు దక్కనుంది. అలాగే, జనసేన పార్టీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది.