మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (16:26 IST)

ఆంధ్రలో పవన్... దక్షిణాది రాష్ట్రాలే ఆదుకున్నాయి : నరేంద్ర మోడీ

Modi_Babu
Modi_Babu
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోమారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రాలేనని, ఆ రాష్ట్రాలే ఆదుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలే ఎన్డీయే భాగస్వామ్య పార్టీల ఎంపీలు, నేతల సమావేశం జరిగింది. 
 
ఇందులో ఆయన ఎన్డీయే కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఆదుకున్నాయన్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక తుఫానులా మారి తమ కూటమికి పునర్జీవం కల్పించారని ఆయన అన్నారు. 
 
ముఖ్యంగా, దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు భాజపాకు అండగా నిలిచారు. 
 
తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళలోనూ మా కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారు. తొలిసారి అక్కడి నుంచి మా ప్రతినిధి సభలో అడుగుపెడుతున్నారు. అరుణాచల్‌, సిక్కింలో క్లీన్‌స్వీప్‌ చేశాం. 
 
ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టింది అని గుర్తు చేశారు. 'గత 30 ఏళ్లలో ఈ కూటమి దేశాన్ని మూడుసార్లు పాలించింది. 
 
మరోసారి ఐదేళ్ల పాలనకు ప్రజలకు అవకాశమిచ్చారు. దేశం కోసం నిబద్ధత కలిగిన బృందం ఇది. ఎన్డీయే అంటేనే సుపరిపాలన. పేదల సంక్షేమమే మనందరి ప్రథమ కర్తవ్యం. దేశ అభివృద్ధి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించాం. వికసిత్‌ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేసి తీరుతాం. మన కూటమి అసలైన భారత్‌ స్ఫూర్తిని చాటుతుంది. 
 
ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయవంతం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం 'అవసరం. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం కావాలి. కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానం. అన్ని అంశాల్లో ఏకగ్రీవ నిర్ణయాలే లక్ష్యం’’ అని మోదీ అన్నారు. ఇక ఎన్డీయే అంటే 'న్యూ ఇండియా, డెవలప్‌డ్‌ ఇండియా, ఆస్పిరేషనల్‌ ఇండియా' అని కొత్త అర్థం చెప్పారు.