1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (16:45 IST)

దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్రాలే కారణం : ప్రధాని మోడీ

petrol
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్రాలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. చమురు ధరలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే వీటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందస్తు కట్టడి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం కీలక భేటీ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్ పన్నును తగ్గిస్తే పెట్రోల్, డీజల్ ధరలు తగ్గుతాయని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించలేదని ఆయన గుర్తుచేశారు. 
 
అలాంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ వ్యాట్ పన్ను తగ్గించని కారణంగా మహారాష్ట్రలో లీటరు పెట్రోల్ రూ.122గా ఉంటే, వ్యాట్ తగ్గించిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.104గా వుందని గుర్తుచేశారు.