శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (14:14 IST)

జమ్మూకాశ్మీర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ - భద్రత కట్టుదిట్టం

pmmodi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. 
 
దాదాపు 30 వేల మంది పంచాయతీ సభ్యులు పాల్గొనే ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ బందోబస్తును కల్పించారు. ఈ సమావేశం సాంబా జిల్లాల పల్లి పంచాయతీ నుంచి దేశ వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఈ సందర్భంగా రైతులు, సర్పంచులు, గ్రామ పెద్దలు తమ ఆదాయాలు పెంచుకునేలా కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
ఇటీవల ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఆ తర్వాత భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.