గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (20:06 IST)

కాశీ విశ్వనాథుడి సేవలో ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కాశీ విశ్వనాథుడి సేవలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయన ముందుగా గంగానదిలో లలితా ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఆ తర్వాత ఆ నదీజలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగానది నీటిలో ఆలయానికి వెళుతున్న సమయంలో ప్రధాని మోడీకి ఆలయ పూజారులు స్వాగతం పలికారు. 
 
నది నుంచి కొంతదూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకుంటూ స్వామి వారి సన్నిధికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడిలో మోడీతో వేద పండితులు అభిషేకం చేయించారు. తొలుత వారు సంకల్పం చదివారు. 
 
విఘ్నేశ్వర పూజ, బిల్వపత్రం సమర్పణ, పంచామృత పూజ, వస్త్రం, యజ్ఞోపవీతం సమర్పణ, నమక చమకాలతో విశ్వనాథుడి ఆలయం మంత్రోచ్ఛరణతో ప్రజ్వరిల్లింది. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసిన మోడీ నైవేద్యం సమర్పించారు. 
 
కర్పూరహారం, కరుణావతారం అంటూ గర్భగుడిలో విశ్వనాథుడిని కీర్తించారు. ఆలయ పూజాలులు ప్రధాని మోడీకి ఆశీర్వాదాలు అందించారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రారంభించారు.