శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (12:21 IST)

ప్రశాంతంగా సాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ : ఓటేసిన ప్రధాని

pmmodi
రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు ప్రధాని వెళ్లి ఓటు వేశారు. 
 
ముందుగా పోలింగ్ సిబ్బంది నుంచి బ్యాలెట్ పేపర్, పెన్ తీసుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన ఏకాంత గడిలోకి వెళ్లి ఓటు నమోదు చేసి దాన్ని మడిచి బయటకు తెచ్చి బ్యాలెట్ బాక్సులో వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
ఆ తర్వాత ప్రధాని మోడీతో పాటు వచ్చి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ఓటు వేయగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్‌, తెలంగాణలో మంత్రి కేటీఆర్‌ తొలి ఓటు వేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మొత్తం పోలింగ్‌ ప్రక్రియను వీడియో తీస్తున్నారు. 
 
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలోని పోలింగ్‌ కేంద్రంలో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. వైకాపా తరపున మంత్రి బుగ్గన, శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త, ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. 
 
మొత్తం 175మంది ఎమ్మెల్యేలు పోలింగ్‌లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వైకాపా, తెదేపాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్‌లో ఓటు వేయనున్నారు.
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభలోనూ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తరలి వచ్చారు. తొలి ఓటు హక్కును మంత్రి కేటీఆర్‌ వినియోగించుకోగా.. ఆ తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి తెలంగాణ శాసనసభలో ఓటు వేశారు.