గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (09:17 IST)

భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు సర్వంసిద్ధం

president poll
భారత 15వ రాష్ట్రపతి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్‌తో సహా పలు రాష్ట్రాల శాసనసభలో పోలింగ్ జరగనున్నప్పటికీ ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు మాక్ ఎలక్షన్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహిస్తారు.
 
ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హాలు దేశ ప్రథమ పౌరుడిగా పోటీ పడుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు ప్రాధాన్యతా పద్ధతిలో ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యతకు అనుగుణంగా వారి పేర్ల ఎదుట 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. 
 
వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నారు. అసెంబ్లీ ప్రాంగణమంతా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, ప్రభుత్వ విప్‌లు సహ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.