గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:05 IST)

సర్జికల్ స్ట్రైక్స్ ఓవర్.. వాట్ నెక్స్ట్ .. ప్రధాని హైలెవల్ మీటింగ్

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో మెరుపుదాడులు నిర్వహించాయి. ముజఫరాబాద్ సెక్టార్‌లో జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో జైష్ మొహమ్మద్‌కు చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, 300 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ మెరుపు దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది. భారత్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఇదిలావుంటే, ఈ మెరుపుదాడులను భారత వైమానికదళం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తాజా సమాచారం మేరకు... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్‌ను తన సహచరులకు ప్రధాని మోడీ వివరించినట్టు తెలుస్తోంది. 
 
వాయుసేన సాధించిన విజయంతో పాటు.. ఇండో-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఇకపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత అధికారులు హాజరయ్యారు.