గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (15:32 IST)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పేలుడు పదార్థాల కలకలం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఈ పదార్థాలను గుర్తించాయి. ముఖ్యంగా అయ్యప్ప ఆలయ మార్గంలోని పెన్‌ఘాట్ వంతెన కింద మొత్తం 6 కేజీల జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆలయ భద్రతా అధికారులు బాంబు స్క్వాడ్‌లను రంగంలోకి దించి ఆలయ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. 
 
ఇటీవల మకర జ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇలా వచ్చిన భక్తులే ఈ పేలుడు పదార్థాలు తరలించివుంటారని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు, మకర జ్యోతి దర్శనం అనంతరం శబరిమల ఆలయాన్ని గురువారం నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, భారత 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా, రద్దీ ప్రాంతాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో శబరిమల ఆలయం వద్ద ఈ పేలుడు పదార్థాలను గుర్తించడం కలకలం రేపుతుంది.