పోలియో టీకా పంపిణీ వాయిదా
దేశంలో ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ నెల 17న ప్రారంభించాల్సిన పోలియో టీకా పంపిణీ వాయిదా పడింది.
16న కరోనా వ్యాక్సినేషన్‌లో పాల్గొనే వైద్య సిబ్బంది వెంటనే తర్వాతి రోజు నుండి పోలియో టీకా పంపిణీలో పాల్గొని, ఆ తర్వాత రోజు మళ్లీ కరోనా టీకా పంపిణీలో పాల్గొంటే.. వ్యాక్సినేషన్ డ్రైవ్ పై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేంద్రం భావించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ నెల 16న వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, 17న టీకాల పంపిణీకి అధికారులు సెలవు ప్రకటించారు. 18 నుంచి యథావిధిగా కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానుంది.
ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రాష్ట్రాలన్నీ సిద్ధమయ్యాయి. తగిన చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులను కూడా ఎంపిక చేశాయి. టీకా నిల్వల కోసం పటిష్ట చర్యలు తీసుకున్నాయి. నేడు ఆయా రాష్ట్రాలకు కరోనా టీకా సరఫరా కానుంది.