శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:30 IST)

రూపాయి జరిమానా చెల్లించిన ప్రశాంత్‌ భూషణ్‌

కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు విధించిన ఒక రూపాయి జరిమానాను పౌర హక్కుల లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ సోమవారం చెల్లించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జరిమానాను చెల్లించానంటే దానర్ధం తాను దోషినంటూ ఇచ్చిన తీర్పును అంగీకరించానని కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. ఇది కాకుండా, రాజ్యాంగంలోని 129వ అధికరణ కింద తనకు తాను పరిగణనలోకి తీసుకున్న ధిక్కరణ కేసులో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇంట్రా కోర్టు అప్పీల్‌ యంత్రాంగం లేకపోవడాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో ఇప్పటికే రిట్‌ పిటిషన్‌ ఒకటి దాఖలైంది.

పరస్పర విరుద్ధ ప్రయోజనాలను నివారించేందుకు కోర్టు ధిక్కరణ కేసులో సమీక్షలను విచారించేందుకు మరో బెంచ్‌ను ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన వ్యవస్థను రూపొందించాలని ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టును కోరారు. కోర్టు ధిక్కరణ కేసులో స్ఫూర్తిదాయకమైన డిఫన్స్‌ వాదన చేసిన భూషణ్‌ సత్యమే తన డిఫెన్స్‌ అని అన్నారు.

అందరి పౌరుల్లానే తనకు న్యాయ వ్యవస్థను విమర్శించే హక్కు వుందని, దానికి తాను కట్టుబడి వున్నానని చెప్పారు. అసమ్మతి వాణిని అణచివేసేందుకు కోర్టు ఈ ధిక్కరణ క్లాజును ఉపయోగించుకుందని అన్నారు.

పౌరసత్వ సవరణ బిల్లు నిరసనల్లో పాల్గన్నందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్ధి ఉమర్‌ ఖలీద్‌ను చట్ట విరుద్ధ కార్యకలాపాలన నివారణ చట్టం కింద అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

ఢిల్లీ అల్లర్ల ఛార్జిషీట్‌కు ఎక్కిన సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌, ఆర్థికవేత్త జయతి ఘోష్‌, విద్యావేత్త అపూర్వానంద్‌ల పేర్లను కూడా ప్రస్తావించారు.