తేయాకు తోటల్లో ప్రియాంకా.. కూలీలతో కలిసి.... (Video)
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో అస్సాం ఒకటి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట అయిన అస్సాంలో గత ఎన్నికలు హస్తం పార్టీకి గట్టి షాకిచ్చాయి. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దెదించి భాజపా అక్కడ కాషాయ జెండా ఎగురవేసింది. దీంతో ఈ సారి అస్సాం ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి.
అయితే కీలక నేత, మాజీ సీఎం తరుణ్ గొగొయి మరణం కాంగ్రెస్‌కు లోటుగా మారింది. దీంతో ఈశాన్య రాష్ట్రంలో రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ.. ప్రజలతో మమేకమవుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే రాష్ట్రంలో ప్రియాంకా గాంధీ ప్రచార బాధ్యతలను స్వీకరించారు. దీంతో ఆమె జోరుగా ప్రచారం చేస్తున్నారు. రెండో రోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా బిశ్వనాథ్ ప్రాంతంలోని సాధురు టీ ఎస్టేట్‌కు వెళ్లి అక్కడి కూలీలతో మాట్లాడారు.
అక్కడి కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. తలకు బుట్టవేసుకుని తేయాకు తెంపారు. అనంతరం తోట పక్కనే కూర్చుని కూలీలతో ముచ్చటించారు. 'తేయాకు కూలీలు అసోంతో పాటు ఈ దేశానికి కూడా విలువైనవారు. మీ హక్కులను పరిరక్షించేందుకు, మీకు గుర్తింపు తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పోరాడుతూనే ఉంటుంది' అని ప్రియాంక ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.