శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (11:12 IST)

పుట్టినరోజు వేడుకల్లో విషాదం.. బర్త్‌డే కేక్ ఆరగించి చిన్నారి మృతి

manvee girl
పుట్టినరోజు వేడుకల్లో విషాదం నెలకొంది. బర్త్‌డే కేక్ ఆరగించిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. పుట్టిన రోజు నాడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించిన కేక్ ఆరగించిన మాన్వీ అనే పదేళ్ల బాలిక చనిపోయింది. కేక్ విషపూరితం కావడంతో బాలిక ప్రాణాలు కోల్పోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేక్ ఆరగించిన తర్వాత కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని బాలిక తాతయ్య చెప్పాడు. మృతురాలి చెల్లెలు కూడా స్పృహ తప్పిపడిపోయిందని, పాటియాలలోని 'కేక్ కన్హా' బేకరీ నుంచి ఈ కేక్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి తెప్పించినట్టు తెలిపారు. 
 
కాగా మార్చి 24న రాత్రి 7 గంటల సమయంలో కేక్ కటింగ్ జరిగిందని, రాత్రి 10 గంటల సమయంలో బాలిక సహా, కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారని తాతయ్య హర్బన్ లాల్ వివరించాడు. అందరూ వాంతులు చేసుకున్నారని చెప్పాడు. విపరీతంగా దాహం అవుతోందంటూ మాన్వీ మంచినీళ్లు అడిగిందని, నోరు ఆరిపోతోందని చెప్పిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆమె నిద్రలోకి జారుకుందని వివరించాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం క్షీణించిందని గుర్తించి ఆసుపత్రికి తరలించామని తాతయ్య హర్బన్ లాల్ వివరించాడు.
 
బాలిక మాన్వీకి ఆక్సిజన్ పైపు అమర్చి శ్వాస అందించారని, ఈసీజీ తీశారని.. అయితే వైద్యులు ప్రయత్నించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదని హర్బన్ లాల్ చెప్పాడు. కాగా కేక్‌లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. బేకరీ యజమానిపై కేసు నమోదు చేశారు. కేక్ లోని శాంపిల్ని పరీక్షల కోసం పంపించామని, రిపోర్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
 
కాగా మరణానికి కొన్ని గంటల ముందు బర్త్ డే కేక్ కటింగ్‌లో బాలిక సందడిగా కనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని, మంచి షాపులనే ఎంచుకుని తమ ఫుడ్‌ను ఆర్డర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.