శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (10:00 IST)

రామకృష్ణ మిషన్ స్వామి స్మరణానంద శివైక్యం - ప్రధాని సంతాపం

swami smarananda maharaj
రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ శివైక్యం చెందారు. కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్‌ సేవా ప్రతిష్టాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సమస్యలతో గత జనవరి 29వ తేదీన ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి శివైక్యం చెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, స్వామి స్మరణానంద స్వామి మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. 
 
95 ఏళ్ల వయసున్న స్మరణానంద వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుది శ్వాస విడిచారు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ -బేలూరు మఠం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి 8:14 గంటల సమయంలో స్మరణానంద మహాసమాధికి చేరుకున్నారని, తీవ్ర విచారంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని బేలూరు మఠం పేర్కొంది. స్వామి స్మరణానంద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌తో జనవరి 29న హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం కూడా జరిలంగా మారడంతో మార్చి 3 నుంచి వెంటిలేటరుపై ఉంచారు.
 
కాగా స్మరణానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. స్మరణానంద మహారాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికత, సేవలకు అంకితం చేశారని గుర్తుచేశారు. ఎంతోమంది హృదయాలు, మనస్సులపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. స్మరణానంద అంకితభావం, విజ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు. స్వామి స్మరణానందతో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని అన్నారు. 2020లో తాను బేలూరు మఠాన్ని సందర్శించానని ప్రధాని గుర్తుచేసుకున్నారు. కొన్ని వారాల క్రితం కోల్కతాలో హాస్పిటల్‌ను సందర్శించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నానని అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ స్పందించారు.