ఉత్తరాఖండ్.. 35 కిలోమీటర్ల పాటు వెనక్కి నడిచిన రైలు.. కారణం? (video)
ఉత్తరాఖండ్‌లో ఓ రైలు సాంకేతిక లోపం కారణంగా ఏకంగా 35 కిలోమీటర్ల పాటు వెనక్కి నడిచింది. ట్రాక్‌పైకి వచ్చిన పశువులను ఢీకొట్టకుండా ఉండేందుకు లోకోపైలట్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి రైలు వెనక్కి వెళ్లడం మొదలుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయలుదేరిన పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌లో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది.
ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరగగా.. రైలు 35 కిలోమీటర్లు వెనక్కి నడిచి ఖాతిమా దగ్గర ఆగిపోయింది. రైలు చాలా వేగంగా వెనక్కి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. సడెన్ బ్రేకు వేయడంతో ఇంజిన్‌పై లోకోపైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది.
ఖాతిమా దగ్గర రైలు నిలిచిపోయిన తర్వాత ప్రయాణికులను కిందికి దించి బస్సుల ద్వారా తనక్‌పూర్‌కు పంపించారు. రైలు లోకోపైలట్, గార్డ్‌లను సస్పెండ్ చేశారు. అసలు ఇలా జరగడానికి కారణమేంటన్నది తెలుసుకోవడానికి ఓ సాంకేతిక బృందం తనక్‌పూర్ వెళ్లింది.