శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (11:42 IST)

కర్నాటకలో కాంగ్రెస్ హామీ... అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ప్రయాణం

rahul gandhi
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, వచ్చే నెల 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, జేడీఎస్‌లు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఓటర్లను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలకమైన హామీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
గురువారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తూ, 'కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చదని ప్రధాని మోడీ అంటున్నారు. ఇప్పటివరకు మేం నాలుగు హామీలు ఇచ్చాం. ఇప్పడు వాటికి మరో హామీని కలుపుతున్నా. ఇది మహిళల కోసం. అధికారం చేపట్టిన మొదటి రోజే ఈ ఐదో హామీని నెరవేరుస్తాం. కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే.. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు' అని రాహుల్ గాంధీ తెలిపారు. 
 
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్నభాగ్య, యువనిధి పేరుతో నాలుగు హామీలను ఇచ్చింది. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తామని తెలిపింది. గృహ లక్ష్మీలో భాగంగా మహిళలకు రూ.2,000 ఆర్థిక సాయం ప్రకటించింది. 
 
అన్నభాగ్య పథకం ద్వారా దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 10 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. యువనిధిలో భాగంగా 18 నుంచి 25 ఏళ్లున్న డిప్లొమా చదువుకున్న యువతకు రూ.1,500, డిగ్రీ చదువుకున్న యువతకు రూ.3,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఇపుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది.