బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (09:00 IST)

ముఠాతత్వమే కొంప ముంచాయి.. హర్యానా ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ సమీక్ష

congressflags
ఇటీవల వెల్లడైన హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నట్టుగా కనిపించి, చివరకు ఓటమి పాలైంది. ఈ ఫలితాలపై ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించారు. మఠాతత్వం, వ్యక్తిగత ప్రయోజనాలే పార్టీ విజయాన్ని అడ్డుకున్నాయని వారు నిర్ధారించారు. దీనిపై త్వరలోనే నిజనిర్ధారణ కమిటీ వేయనున్నట్టు వారు ప్రకటించారు. 
 
హర్యానా ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై కాంగ్రెస్ పార్టీ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఏఐసీసీ  హర్యానా వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపక్ బాబరియా వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరయ్యారు. 
 
ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓడిందన్న దానిపై వాస్తవాలు వెలికి తీసేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా ఎదురైన సమస్యలను ఈ సందర్భంగా తెలుసుకుంటారు. పార్టీ అభ్యర్థులందరి అభిప్రాయాలను కమిటీ సేకరించి నివేదిక రూపంలో ఇస్తుందని పార్టీ సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. 
 
కాగా, ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రారంభ ట్రెండ్స్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని చూపించింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇరు పార్టీల మధ్య పది స్థానాల తేడా కనిపించింది. దీంతో బీజేపీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.