మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2024 (12:06 IST)

హరియాణాలో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది,బెడిసి కొట్టింది అక్కడేనా?

హరియాణా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒకే పార్టీ వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని 90 స్థానాలకు అక్టోబర్ 5న ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ బలహీనంగా కనిపించింది. దీంతో, విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. హరియాణాలో బీజేపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించి పెడుతుందని విశ్లేషకులూ అంచనా వేశారు.
 
దేశంలోని అనేక మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. ఆ పార్టీకి దాదాపు 60 సీట్లు వస్తాయని చెప్పాయి. రైతుల సమస్యలు, 'అగ్నివీర్' లాంటి అనేక విషయాలపై హరియాణా ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ నిపుణుల విశ్లేషణల నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనాలవరకూ అన్నీ తప్పని చూపించాయి. హరియాణా ఓటమి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర దిగ్భ్రాంతే. ఇంతకీ, కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి?
 
జాట్ వర్సెస్ నాన్-జాట్
సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ అత్రి మాట్లాడుతూ "ఈ ఫలితాల వెనుక అతిపెద్ద కారణం బీజేపీ మైక్రో మేనేజ్‌మెంట్. హరియాణాలో జాట్‌యేతర ఓట్లను బీజేపీ చాలా తెలివిగా రాబట్టింది. ఫలితంగా హుడాకు బలమైన కోటగా ఉన్న సోనిపట్‌లోని 5 స్థానాల్లో కాంగ్రెస్ నాలుగుచోట్ల ఓడింది’’ అన్నారు. "హరియాణాలో జాట్‌ల ఓట్లు దాదాపు 22 శాతం ఉన్నాయి, వారు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తారు. కాంగ్రెస్ గెలిస్తే, భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రి అవుతారని జాట్‌యేతరులు భావించారు. కాబట్టి వారు చడీచప్పుడు కాకుండా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు" అని సీనియర్ జర్నలిస్ట్ ఆదేశ్ రావల్ అన్నారు.
 
ఆదేశ్ రావల్ ప్రకారం.. ఈ ఎన్నికల్లో జాట్‌లు, జాట్‌యేతరుల ప్రాతిపదికన ఓట్ల విభజన జరిగింది, దీని వల్ల కాంగ్రెస్‌కు నేరుగా నష్టం వాటిల్లింది. అనేక స్థానాల్లో జాట్‌యేతరులు, జాట్‌ల మధ్య ఓట్లను బ్యాలెన్స్ చేస్తూ బీజేపీ విజయం సాధించింది. రాష్ట్రంలోని అనేక స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి, కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టింది. వీటిలో ఆసంధ్, దాద్రీ, యమునానగర్, సఫిడాన్, సమల్ఖా, గోహనా, రాయ్, ఫతేహాబాద్, తోషమ్, బధ్రా, మహేంద్రగఢ్, బర్వాలా వంటి స్థానాలు ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడింది.
 
వర్గపోరు
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీలోని వర్గపోరూ కారణమనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థుల్లో భూపిందర్ సింగ్ హుడా శిబిరంలో ఎవరున్నారు? కుమారి సెల్జాకు ఎవరు సన్నిహితులు అనే కోణంలోనే రాజకీయాలు నడిచాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులను హైకమాండ్ అభ్యర్థులుగా అభివర్ణించారు. వీటి కారణంగా కాంగ్రెస్ దాదాపు 13 స్థానాలను కోల్పోయిందని హేమంత్ అత్రి అభిప్రాయపడ్డారు. వీరిలో భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు.
 
చాలామంది కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో గెలవడం కంటే సీఎం కుర్చీపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే వార్తలొచ్చాయి. అతి విశ్వాసం పనికిరాదని చెప్పడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ అని పరోక్షంగా కాంగ్రెస్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. హరియాణాలో కాంగ్రెస్, ఆప్‌ మధ్య పొత్తు గురించి చర్చలు జరిగాయి, అయితే సీట్ల పంపకంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
 
సీట్ల పంపిణీ
ఈసారి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. వీరిలో 16 మంది విజయం సాధించారు. బీజేపీ తన పాత 27 సీట్లను కాపాడుకోగలిగింది, 21 కొత్త స్థానాలనూ గెలుచుకుంది. ఈసారి బీజేపీ 89 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. "కాంగ్రెస్ చాలావరకు సిట్టింగ్‌లకే టికెట్ ఇచ్చింది, వారిలో సగం మంది ఓడిపోయారు, అభ్యర్థులను మార్చకపోవడంతో కాంగ్రెస్‌కు దెబ్బ పడిందని స్పష్టమైంది" అని హేమంత్ అత్రి అన్నారు.
 
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి 40 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 31 సీట్లలో విజయం సాధించింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 46 శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ. ఈ తేడా అసెంబ్లీ ఎన్నికలలో ఇంకా తగ్గిపోయింది. తాజా ఎన్నికలలో బీజేపీకి 39.94శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 39.09శాతం ఓట్లు వచ్చాయి.
 
దళిత ఓటర్లు
లోక్‌సభ ఎన్నికల్లో దళితుల ఓట్లలో ఎక్కువ భాగం కాంగ్రెస్‌కే వచ్చాయని, కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓట్లు కాంగ్రెస్‌కు దూరమయ్యాయని నిపుణుల అభిప్రాయం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో మాయావతికి చెందిన బీఎస్పీకి కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతాన్ని 1.82శాతానికి పెంచుకుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి 1.79శాతం ఓట్లు వచ్చాయి.
 
ఉదాహరణకు, హరియాణాలోని అసంధ్ అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత, కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థికి 2,306 ఓట్లు ఎక్కువ వచ్చాయి, అయితే, ఇదే స్థానంలో బీఎస్పీ 27 వేలకు పైగా ఓట్లను సాధించింది. "ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలో దళితులు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కేవలం మూడు నెలల్లోనే దళితుల ఓట్లు ఏమైపోయాయో కాంగ్రెస్ ఆలోచించుకోవాలి" అని ఆదేశ్ రావల్ సూచించారు.
 
బీజేపీ మైక్రో మేనేజ్‌మెంట్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, 10కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఓటమికి చిన్న పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. హేమంత్ అత్రి ప్రకారం, బీజేపీకి చాలా స్థానాల్లో విజయావకాశాలు తక్కువగా ఉన్నాయి, అయితే ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీకి లాభపడ్డారు. ఉదాహరణకు, దాద్రీ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌పై 1,957 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఇక్కడ మూడో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి సంజయ్ ఛపారియా 3,713 ఓట్లను పొందారు.
 
సఫీడన్ సీటులోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్‌పై బీజేపీ మెజారిటీ దాదాపు 4,000 ఓట్లు కాగా, మూడో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థికి 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఫతేహాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి మెజారిటీ కేవలం 2,252 ఓట్లు, అయితే ఈ స్థానంలో మిగిలిన నలుగురు అభ్యర్థులకు 2,500 నుంచి 10,000 ఓట్లు వచ్చాయి.