శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (11:55 IST)

ఈ పజిల్‌ను పరిష్కరించేది ఎలా? రాహుల్ గాంధీ

కేంద్ర ప్రభుత్వం, భారతీయ రైల్వే శాఖ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తూర్పారబట్టారు. లాక్‌డౌన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో చిక్కుకునిపోయిన వలస కూలీలను తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో రైల్వే శాఖ ముందుకు వచ్చి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణించే వలస కూలీల నుంచి రైల్వే శాఖ చార్జీలు వసూలు చేస్తోంది. ఇది పెద్ద దుమారాన్ని రేపింది. వలస కూలీల నుంచి రైలు టిక్కెట్ల కోసం డబ్బులు తీసుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. 
 
'ఓ వైపు దేశంలోని వలస కూలీలను తమ ప్రాంతాలకు తరలించడానికి కూలీల నుంచి రైల్వే శాఖ టిక్కెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తోంది. మరోవైపు అదే రైల్వే శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు విరాళంగా ఇస్తోంది. ఈ పజిల్‌‌ను పరిష్కరించేది ఎలా?' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
కాగా, వలస కూలీల నుంచి టిక్కెట్ డబ్బులు వసూలు చేయడం సరికాదని, కావాలంటే వారి టిక్కెట్ల డబ్బులను తాము భరిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె కేంద్రానికి ఓ లేఖ కూడా రాసింది. ఇపుడు రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.